రేవ్ పార్టీ అంటే ఏమిటీ .. అక్కడ ఏం జరుగుతుంది..?
బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫాంహౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడం దక్షిణాది రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీలో సినీ ప్రముఖులు, తెలుగు- కన్నడ టీవీ నటులు, మోడల్స్ , డ్యాన్సర్లు పాల్గొన్నట్లుగా పోలీసులు తెలిపారు. అంతేకాకుండా 45 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు, కొకైన్ తదితర మత్తు పదార్ధాలను, 18 కార్లను సీజ్ చేసినట్లుగా వెల్లడించారు.
ఈ రేవ్ పార్టీకి 101 మంది వరకు హాజరవ్వగా.. వారిలో 30 మంది మహిళలున్నారని .. వీరందరినీ విచారిస్తున్నామని చెప్పారు. సినీనటులతో పాటు పలు రంగాల ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘సన్‌సెట్ టూ సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో ఆదివారం సాయంత్రం నుంచే రేవ్‌పార్టీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భారీ శబ్ధంతో కూడిన డీజేలు, గోలగోలగా ఉండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. వారు అక్కడికి చేరుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటీ..? అక్కడ ఏం చేస్తారు..? డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతాయా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో రేవ్ పార్టీ అంటే ఏంటో పరిశీలిద్దాం.
విదేశాలతో పాటు ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, పూణే వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో ఈ రేవ్ పార్టీ కల్చర్ విశృంఖకలంగా జరుగుతోంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరానికి కూడా ఈ విష సంస్కృతి పాకింది. డ్యాన్స్, ఫుడ్, ఫన్, మద్యం, మాదక ద్రవ్యాలు ఒకటేమిటి సమస్తం ఇక్కడ దొరుకుతాయి. అందుకే సంపన్నులు, సెలబ్రెటీలు రేవ్ పార్టీలకు పరుగులు తీస్తుంటారు. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాలకు ప్రత్యేక రూమ్స్ కూడా ఉంటాయని అంటారు.
80వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీ కల్చర్ ప్రారంభమైంది. అమెరికా న్యాయ శాఖ ప్రకారం రేవ్ పార్టీలు డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించాయట. భారతదేశంలో ఈ విష సంస్కృతి గోవా నుంచి ప్రారంభమైందట. అక్కడి నుంచి అనేక భారతీయ నగరాలకు రేవ్ పార్టీలు విస్తరించాయి. చీకటి గదుల్లో లేజర్ లైట్ల వెలుగుల్లో మ్యూజిక్ ప్లే చేస్తారు.
అయితే రేవ్ పార్టీకి కొన్ని నిబంధనలను నిర్వాహకులు ఫాలో అవుతారు. కేవలం బాగా పరిచయం ఉన్న వ్యక్తులనే పార్టీకి ఆహ్వానిస్తుంటారు. కొత్తవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే వారి వల్ల విషయం బయటికి పొక్కుతుందనే భయం. రేవ్ పార్టీలను 24 గంటల నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి.. ఎవరెవరు హాజరవుతున్నారనే విషయంలోనూ నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
మిగిలిన నగరాల సంగతేమో కానీ తెలుగు నాట హైదరాబాద్ .. ఈ రేవ్ పార్టీలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా వీకెండ్స్, పండుగలు, స్పెషల్ ఈవెంట్స్ వున్న సమయాల్లో నగర శివారుల్లోని ఫాంహౌస్‌ల్లో ఈ పార్టీలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా పోలీసులు ఓ కన్నేసి ఉంచడంతో తరచూ ఎక్కడో చోట రైడ్లు, డ్రగ్స్ సీజ్, పట్టుబడిన వారిలో ప్రముఖులు అంటూ బ్రేకింగ్స్ షరా మామూలైపోతున్నాయి.

Comments
Post a Comment